సుల్తాన్ ముహమ్మద్ పి.ఖాన్ గారి సాక్ష్యము

నేను నిజరక్షణను కనుగొన్నాను 

నేను ముస్లిం కుటుంబములో పుట్టిపెరిగినా దేవుని ఉనికిని గురించిన ప్రశ్న నన్నెల్లప్పుడూ బాధిస్తునే ఉండేది. దేవుని యొక్క సత్యాన్వేషణలలో యింత తీవ్రమైన అనుమానాలు ఉంటాయని నేను తలంచలేదు. కళాశాలలో అధికముగా మానసిక ఒత్తిడులకు లోనయ్యాను. దేవుడనే వాడు ఉన్నాడాలేడా? అనే ప్రశ్న ఆ కళాశాలలో పారసీక (పర్షియన్) భాషను బోధించే స్నేహశీలి, ఆకర్షణీయుడైన అధ్యాపకుని వద్ద చదివే అనేక మంది విద్యార్థులను కూడా వేధించేది. ఐతే, అతని ప్రభావము వలన దేవుని ఉనికిని గూర్చిన ప్రశ్నను నా నుండి దూరముగ నెట్టివేయగలిగాను. అతడు ఒక ముస్లిం. కానీ తన మతపరమైన అభిప్రాయాలను విడిచిపెట్టి నాస్తికవాదాన్ని వినిపించుటకు సంశయించేవాడు కాదు.

నాలోని ఇస్లాంమత వేరులు చాలా లోతైనవి. భారతదేశములోని లక్నో పట్టణములో భక్తిగల షియా కుటుంబములో జన్మించాను. అరబీ భాష బోధించే ఖురాన్ పాఠశాలలో ప్రథమపాఠాలు నేర్చుకొన్నాను. నా కుటుంబికులు మరియు నా ఉపాధ్యాయుల ద్వారా ఖురాన్‍ను ఎంతో శ్రద్ధాభక్తులతో కంఠస్థము చేస్తూ నమాజులు తప్పేవాడిని కాను. క్రమము తప్పకుండ మసీదులకు, మత సమాజ ప్రార్థనలకు వెళ్ళేవాడిని. ఇస్లాం మతము యొక్క నియమనిబంధనలు, అభ్యాసములు నా జీవితాన్ని మరియు మా సమాజమును నడిపించేవి. నా మతము యొక్క ఆజ్ఞలను, నియమాలను ప్రశ్నించవలసిన అవసరము నాకెన్నడూ రాలేదు.

సున్నీలకు, షియాలకు ఎన్నో పర్యాయములు కలహములు వచ్చేవి. ఆ సమయాలలో సామాన్యముగా నేను ఉద్రేకాలకు లోనయ్యేవాడిని. అబు బక్ర్, ఉమర్, ఉత్మాన్‍లపై షియాలు శాపనార్థాలు పెట్టినప్పుడు సున్నీలు షియాలపై తమ కోపాన్ని చూపేవారు. షియాల నమ్మకము ప్రకారము ముహమ్మదు వంశానికి అలీయే వారసుడుగా ఉండాలి. అందువలన, అలీ జ్ఞాపకార్థము జరిగే పండుగ ఉత్సవములలో ఈ కలహములు మరి ఎక్కువగా జరిగేవి.

మా కుటుంబము మైనారిటీలలో అతి మైనారిటీకి చెందినది. ఆనాడు హిందూదేశములోని ఆరువందల మీలియన్ల ప్రజలలో అరువది ఐదు మిలియన్లు మాత్రమే ముస్లిములుగా ఉండేవారు. సున్నీలు, షియాలు సాధారణంగా స్నేహంగా ఉన్నా వారి మధ్య తలెత్తిన విభేదాలు వీరిని కొంచెము ఎడమపరచేవి. ప్రస్తుత ఖురాను ఆకాశము నుండి వచ్చిన సంపూర్ణ పుస్తకమనే భావాన్ని షియాలు తిరస్కరించేవారు.  మహమ్మదునకు వారసుడు అలీ అన్న భాగాన్ని సున్నీలు తొలగించారని వీరు నమ్మేవారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నేను ప్రపంచాన్ని వీక్షంచేవాడను.

నేను కళాశాలకు వెళ్ళే సమయము వచ్చింది. పర్షియా భాష నేర్చుకోడానికి రాంపూరు వెళ్ళవలసి వచ్చింది. పూర్వముకంటే ఎక్కువగా ఇస్లాం మతాన్ని పరిశోధించడానికి యిది మంచి అవకాశము. కళాశాలలో నా మొదటి సంవత్సరమున ఒక నాస్తిక ప్రొఫెసరు నన్నెంతో యిష్టపడేవాడు. భౌతిక పదార్థమే నిత్యమైనదనీ, అందువలన దేవునియెడల నమ్మకముంచవలసిన పనిలేదనేవాడు. నిజానికి దేవుడున్నాడన్న అభిప్రాయము శాస్త్రీయము కాదు, అది ప్రాచీన నిరాధార నమ్మకమేనన్నది ఆయన అభిప్రాయము. విద్యార్థుల మీద ఆయన ప్రభావము శక్తివంతంగా ఉండేది. కొద్దికాలము ఆయన అభిప్రాయాల గాలివాటానికి కొట్టుకు పోయాను. కానీ నాస్తికత్వము నన్ను అసంతృప్తునిగా మిగిల్చినది. చాలా ప్రశ్నలకు సమాధానము దొరకలేదు.

ఐతే మా విద్యార్థులలో మాత్రం చాలమంది ఈ ప్రొఫెసరు గారి అభిప్రాయాలతో ఏకీభవించారు. కానీ వీరు తమ గృహాలకు వెళ్ళినప్పుడు సాంఘిక కట్టుబాట్లకు లోనైనవారై ఇస్లాం మతాచార జీవితానికి కట్టుబడి యుండేవారు. నేనైతే ఒక నిశ్చయానికి వచ్చాను. వేషధారణ, డోలాయమాన మనస్సుతో కాక, ఈ సమస్యకు జ్ఞానపూరితమైన నిర్ణయము తీసుకోవాలని దృఢమైన నిర్ణయము తీసుకొన్నాను. ఒక నిర్దిష్ట క్రమములో నిర్మించబడ్డ ఈ విశ్వం శాశ్వతమైనది కాదనుటకు నిరాక్షేపమైన సాక్షాధారముగలవని తెలిసికొన్నాను. శక్తివంతుడు, జ్ఞానవంతుడునైన దేవుడే యీ ప్రపంచ నిర్మాణానికి కారకుడని నేను ఒప్పుకొనవలసి వచ్చెను. ఈ సృష్టి నిర్మాణకుడు గ్రుడ్డివాడైతే ఇందులో ఏ క్రమమూ ఉండదన్న విచక్షణ నాకు కలిగింది. అన్నిటిని సృష్టించిన జ్ఞానముగల ఆ నిర్మాణశక్తికి ఒక క్రమమున్నది కనుక, ఈ క్రమాన్ని సృజించిన కారణకారియగు సృష్టికర్త తప్పనిసరిగ ఉంటాడు అని నిర్ధారించుకొంటిని. అందువలననే ఎక్కడ చూచినా క్రమము మనకు గోచరమగుతుంది. ఆవ్యక్తే ప్రపంచాన్నంతా పాలిస్తూ క్రమబద్ధీకరణ చేస్తున్నాడు. ఈ ఆలోచనలు నిజదేవుని తెలుసుకోడానికి మార్గము చూపినవి.

ఇంత వరకు నా జీవితంలో ఏ క్రైస్తవునితో సన్నిహిత సంబంధము కలుగలేదు. విద్యావంతురాలైన నా తల్లి యేసుక్రీస్తు గురించి మొట్టమొదటి సారిగా మాట్లాడింది. ఆమె ఒక ముస్లిమైనా యేసుప్రభువు అంటే అసాధారణమైన విలువయిచ్చేది. నేను బాలుడిగా ఉన్నప్పుడు ఆయన గురించిన కథలు ఎన్నో చెప్పేది. ఆ విధంగా ఆయన యెడల నా ఆదరణ పెరుగుతూ ఉండేది. అయినప్పటికి ముహమ్మదే ప్రవక్తలలో చివరివాడని నమ్మేవాడను. నేను చిన్నవాడిగా ఉండినప్పుడు ప్రవక్తలందరిలో యేసు ప్రభువే గొప్పవారు అనే ఆలోచన నాకు ఉండేది. ఖురాన్‍లో చెప్పినట్లు ముహమ్మదు కూడా చేయని అద్భుతాలెన్నిటినో క్రీస్తు చేసియుండుట కుడా నాకుండిన ఆ అభిప్రాయమునకు ఒక బలమైన కారణము.

ప్రాచ్య భాషలలో డిగ్రీ పొందాక రామపుర్ నుండి అలహాబాదునకు ఒక బడిలో ఉపాధ్యాయునిగా వెళ్ళవలసి వచ్చింది. మార్గములో నైనిటాల్ అనే ప్రదేశములో కవి సమ్మేళనలో పాల్గొనాలని ఆగితిని. ఆ సమ్మేళనలో నాకున్న పద్య కవిత్వము యెడల గల ఆసక్తిని బట్టి నాకు ఒక వ్యక్తి అతి సన్నిహితుడయ్యాడు. నాకు పరిచయమైన మొదటి క్రైస్తవుడితడే. అతడు నాకు ఒక నూతన నిబంధనను బహూకరించాడు. అంతవరకు నాకున్న క్రైస్తవ విశ్వాసమును గూర్చి తీవ్రముగా ఆలోచించడానికి అది కారణమైంది. ఈ ఆసక్తి తిరిగి అలహాబాదులో ప్రజ్వలింపబడినది; ఏలాగనగా, అలహాబాదులో నేను వెళ్ళే మార్గములో క్రైస్తవ సాహిత్యనికి సంబంధించిన ఒక గ్రంథాలయముండేది. అక్కడ ఉత్తమమైన క్రైస్తవసాహిత్యము మాత్రమేకాక మంచి క్రైస్తవ లైబ్రేరియన్‍తో పరిచయము కలిగినది. అతడు ఒక యథార్థ భారతదేశ క్రైస్తవుడు. ఈ లైబ్రేరియన్ యందు క్రీస్తును పోలిన ఒక క్రైస్తవుడు నాకు పరిచయమయ్యాడు. ఇతడు తన ఆదాయమంతా పేదవారికి యిచ్చేవాడు, చాపమీదనే నిద్రించేవాడు. నేనెప్పుడు అతనిని చూచినా మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండడము చూచేవాడిని. అతడు నన్నేంతో దయగా చూచి తనతో ఉండమనేవాడు, ఆ విధముగా అతనితో మూడు సంవత్సరములున్నాను. ఆ సమయములో నేను బోధనా వృత్తిలో ఉండేవాడిని. అదే సమయంలో నా స్నేహితుడు నాకు నూతన నిబంధనను బోధిస్తూ ఉండేవాడు. నూతన నిబంధనను మొదటి నుండి చివరి వరకు బోధించడానికి ఆయనకు ఎక్కువ సమయమే పట్టింది. ఇంతకు ముందు యేసుక్రీస్తు అందరిలో అధికుడని, ప్రవక్తలలో శ్రేష్ఠుడని అనుకొనే వాడిని. కాని నూతన నిబంధన చదివి ముగించిన తరువాత క్రీస్తుప్రభువు రక్షకుడని, దేవుని యొద్ద మనం స్వీకరించబడాలంటే మనకున్న ఏకైక ఆశ లేక నిరీక్షణ ఆయనే అని తెలుసుకొన్నాను.

నా నుతన నిబంధన అధ్యయనంలో యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు నన్నెంతో ఆకట్టుకొన్నాయి. యోహాను 3:16 వచనం, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" అని చదివినపుడు నాకు ఒక తలంపు వచ్చెను. దేవుడు ఎవరినీ శిక్షించడు కాని క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కడు తన యొద్దకు రావాలని కోరుచున్నాడు. ఇంకొకటి అమితంగా నా హృదయాన్ని కదిలించింది.  క్రీస్తుప్రభువు ఏమీ ఆశించక తన్నుతాను ఇతరుల కొరకు సిలువపై అర్పించుకున్నారు. ఆయన మరణ పునరుత్థానములు ద్వారా మాత్రమే మానవునికి పాపక్షమాపణ కలిగి దేవుని తెలుసుకొనగల్గుతారు అని ఎరిగితిని.

ఆ దినాలలో ఎన్నోప్రశ్నలు నా మనసుని కలవరపరిచేవి. అన్నిటికంటే ముఖ్యముగా క్రీస్తుప్రభువు దేవుని కుమారుడెలా అయ్యారన్నది ముఖ్యమైన ప్రశ్నగా ఉండేది. ఖురానైతే దేవుడు జన్మించడు, జన్మను యివ్వలేడు అని చెప్తుంది. మానవునికి పిల్లలు కలగడమువలే దేవునికి పిల్లలు కలగడము అసంభవమనిపించింది. నేను పాతనిబంధన చదివినపుడు క్రీస్తు కుమారత్వమును గూర్చిన యిటువంటి బోధ నాకు తటస్థించలేదని నేను గ్రహించాను.

అరబీ భాషను నేను నేర్చుకొన్నప్పుడు పై భావము యొక్క వివరణ నేను గ్రహించాను. ఉదాహరణకు ఖురాన్ లో "ఇబ్న్ ఎ సబీల్" అను పదమున్నది. ఈ పదము యొక్క అర్థము "మార్గము యొక్క కుమారుడు". ఇంకొక పదము "ఇబ్న్ ఎ షైతాన్" అనగా "షైతాను కుమారుడు" అని భావము. ఈ విధంగా ఆ పదబంధాల ప్రయోగము కేవలము అలంకార రూపమైన ప్రయోగమే కాని  శారీరక పునరుత్పత్తి గురించి కాదు అని గుర్తించితిని. కాబాను కూడా "మక్కా పట్టణము యొక్క తల్లి" అని పిలుస్తారు. అదేవిధముగా, దేవుని కుమారుడంటే దేవునికి క్రీస్తుకు ఉన్న విలక్షణ సంబంధాన్ని తెలుపుతుంది కాని మరొక భావన అందులో లేదు.

క్రైస్తవ విశ్వాసాన్ని గురించి ఆలోచిస్తే "దేవుని కుమారుడు" అనే పదముకు "త్రిత్వము" తో విడదీయరాని బంధముంది. నేను ముస్లిముల దృక్పథముతో ఆలోచించి క్రెస్తవులందరిని విగ్రహారాధికులుగ భావించేవాడిని. వారు ముగ్గురు దేవుళ్ళను నమ్ముతారని భవించేవాడిని. బైబిలును జాగ్రత్తగా పరిశీలించినపుడు క్రైస్తవ విశ్వాసమును తప్పుగా అర్థము చేసుకొంటినని నేను గ్రహించాను. పదే పదే బైబిలు నుండి నేను  గ్రహించినదేమనగా,  బైబిలు విగ్రహరాధనను నిరసించడమే కాక అనేక దేవుళ్ళు లేరని చెప్తుంది. నిజమైన దేవుడు ఒక్కడే అని బైబిలు నొక్కి చెబుతున్నది. బైబిలులోని దేవుని ఏకత్వము క్రొత్తవారు అర్థము చేసికొనుటకు కొంచెము క్లిష్టతరమైనది. బైబిలు చెప్పుచున్నదేమంటే, తండ్రి, కుమార, పరిశుధ్ధాత్మ అనే త్రిత్వము కలదు. అనగా వీరు ముగ్గురు వేరువేరు వ్యక్తులు కారు, నిత్యత్వ కాలపరముగ చూసినా, వారి అస్థిత్వపరముగ చూసినా ఆయన ఒకే దేవుడు. దాని అర్థమేమనగా క్రీస్తు రెండవ దేవుడు కారు. రెండు, ముడు అను సంఖ్య గల దేవుళ్ళు లేరు.

బైబిలు వాస్తవమా అనే ప్రశ్న సహజంగానే నాలో ఉదయించింది. అది నిజంగా దేవుని వాక్యమా లేక మార్చబడినదా? దేవునిచే పలుకబడిన మాటలు మార్చి వ్రాయబడినవా? ప్రస్తుతమున్న బైబిలు దేవునిచే పలుకబడిన అసలైన ప్రతికి మార్పు చేయబడిన రూపమా! జాగ్రత్తగా పరిశీలించి చదివిన మీదట బైబిలు ఖచ్చితమైనదిగాను, యథార్థమైనదిగాను, నేను కనుగొన్నాను. ఏ ఒక్కరు దానిని మార్చుటకు సామర్థ్యము కలిగియుండుటగాని అవకాశము కలిగియుండుటగాని కన్పించదు. నాస్తికవాదులు చేసిన ప్రయత్నములను ఎప్పటికప్పుడు క్రైస్తవ సమాజుము తప్పని తేటతెల్లము చేసినది. అంతేకాకుండ లభ్యమైన వేలకొలది బైబిల్ పత్రాలు తెలిపినదేమనగా ప్రస్తుతము వాడుకలో నున్న బైబిలులోని పాత నిబంధన, క్రొత్త నిబంధన భాగాలతో వాటిని పోల్చగా, మొదటి శతాబ్దానికి ఇప్పటికీ ఏ తేడాలేదు, బైబిలు అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా ఉన్నది అని ఋజువు గావించబడినది..ఈ ఋజువు తిరుగులేనిది, సంతృప్తికరమైనది. కాని ముస్లిం సోదరులకు దురదృష్టవశాత్తు యీ సంగతి ఇంకా మరుగుగా ఉన్నది.

నా తండ్రిగారు నేను అలహాబాదు వెళ్ళకముందే మరణించారు. నేను ఒక క్రైస్తవునితో కలసి నూతన నిబంధన చదువుతున్నానన్న విషయము మా అమ్మ తెలుసుకొన్నప్పడు ఆమె నన్ను ఆటంకపరచలేదు, అభ్యంతరపెట్టలేదు. అది నాకు నా దేవునికి మధ్యగల వ్యక్తిగత విషయమని ఆమె అభిప్రాయము. ఆమెకు యేసు క్రీస్తు యెడల భయభక్తులున్నాయి. విశాల హృదయము, విశాల ధృక్పథము గల స్త్రీ. మా తల్లి మరణించినపుడు నేను క్రైస్తవుడైనందున మా సంప్రదాయ ప్రకారము మా బంధువులు మా ఆస్థినంతటిని కైవశం చేసికొన్నారు. ఎందుకనగా ఇస్లాం ప్రకారం ఒక వ్యక్తి తన మాతాన్ని పరిత్యజించినపుడు అతడేమీ పిత్రార్జితం పొందలేడు. ఇట్టిది జరుగునని నేను క్రైస్తవుడైనపుడే ఊహించాను. నా బంధువులు రెండు గుంపులయ్యరు. నన్ను శ్రమపెట్టినవారు(వీరు అధికసంఖ్యాకులు)నన్ను సహించిన వారు(వీరి సంఖ్యను వ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును). రెండవ గుంపు వారు నాకు నేనుగా ఆలోచించుకొనే వయస్సు, విద్యార్హత నాకున్నాయని తలంచారు. నాకు వ్యతిరేకమైనవారు ఎక్కువగా ఉన్నందువలన నేను ఆ పట్టణాన్ని వదలి ఇంకొక ప్రదేశానికి ఉద్యోగనిమిత్తము వెళ్ళవలసి వచ్చెను. హైదరాబాదులో ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరవలసి వచ్చెను. తదుపరి కాలంలో నేను కళాశాల ఉపాధ్యాయునిగ పనిచేస్తూ ఉర్దూలో ఆరుగ్రంథాలు వ్రాయగలిగాను.

నేనెందుకు క్రైస్తవుడనవవలసివచ్చెనని నన్ను అడుగుతున్నారనుకోండి, దానికి నా సమాధానము సూటియైనది, సాధారణమైనది. నేను క్రీస్తుయందు రక్షణను కనుగొన్నాను. ఖురాన్‍లో రక్షణ దొరకునని హమీ యిచ్చే పదము ఒక్కటి కూడ లేదు. ముస్లిముగా నా పాపాలు క్షమింపబడతాయన్న నమ్మకము లేదు. నా పాపాలు క్షమింపబడతాయని గాని, అల్లాహ్ నా పాపాలు క్షమిస్తాడని గాని, చివరి దినాన నా పాపాలు క్షమింపబడతాయన్న హమీగాని ఇస్లాంలో ఎక్కడా లేదు . ఆ తీర్పుదినాన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న భయంతో బ్రతికేవాడిని. ఇస్లాం మతాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరించి జీవించినప్పటికి, నేను రక్షింపబడతాను, దేవుడు నన్ను కాపాడతాడు అన్న నమ్మకము లేదు. ఇస్లాం మత సంప్రదాయాలను సహించి అనుసరించినంత కాలము భయము అనుమానము ఆందోళన నన్ను వెంతాడుతునే ఉండినవి. నా పాపాలను కొట్టివేసి నా అపరాధాలు క్షమింపబడ్డాయన్న ఒకమాట కొరకు ఎంతో ఎదురుచూచేవాడను. ఇది ఇస్లాం మతంలో దొరకలేదు. అందువలన అశాంతి భారము ఎక్కువయ్యెను.

బైబిలు సందేశము పై దానికి విరుద్ధమైనది, కాని నిజంగా అది శుభసందేశమే. అది క్రీస్తులోని నిజరక్షణను గూర్చి చెప్తుంది. అది పాపక్షమాపణను అనుగ్రహించడమే కాదు, దానికి అవసరమైన చారిత్రక ఆధారము చూపుతుంది. ఇప్పుడు నిశ్చయంగా నేను దేవునితో సమాధాన పరచబడ్డాను. దీనికి ఆధారమేమిటంటే క్రీస్తు ప్రభువు సిలువపై నాపాపాల కొరకు మరణించి, మరణాన్ని జయించడమే. క్రీస్తు ప్రభువును నమ్ముకొనుట ద్వారా నాకు పూర్తి తృప్తి, శాంతి కలిగినవి.

నా అనుభవము ద్వారా ఒకటి తెలుసుకొన్నాను. అదేదనగా ఒక ముస్లిం తను ఉన్న సమాజ కట్టుబాట్లను తెంచుకొని క్రైస్తవ విశ్వాసములో నిలదొక్కుకోవడము చాల కష్టము. సమాజములో కుటుంబస్థులతో ఉన్న సంబంధ బాంధవ్యములను దూరము చేసుకొంటామన్నభయముకూడ ఉండును. ఒక ముస్లిం క్రీస్తును తన ప్రభువుగ, స్వంతరక్షకునిగ అంగీకరించినపుడు మతపరమైన నాస్తికునిగ, నైతికపరమైన కుష్ఠురోగిగ, ఎన్నోదేశాలలో రాజకీయద్రోహిగ పరిగణింపబడును.

నేను పైన చెప్పినవన్నీ అనుభవించాను. నూతన నిబంధనలో యేసుప్రభువు మార్కు 8:32లో చెప్పిన యీ మాటలు నాకేంతో పట్టునిచ్చాయి - "ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?" రక్షణ కేవలము క్రీస్తు వలననే లభించును. అట్టి క్రీస్తును కల్గియుండుట కొరకు యివన్నీ వదలిపెట్టుట ఎంతో ఉత్తమమని నా భావము. ఈ రక్షణ అన్నది మానవ ప్రయత్నము వలన లభించదుకాని ఉచితంగానే లభించును. అందువలననే నేను ఆయన యందు నమ్మిక యుంచియున్నాను. ఆయన నా రక్షకుడు, ఆయన బలియాగమువలన నా పాపములు క్షమింపబడ్డాయి. నేను జీవించినంత కాలము క్రీస్తు సువార్తను, క్రీస్తు రక్షణను నా ప్రజలందరికి చాటి చెప్తాను.

ఈ సాక్ష్యమును ఆంగ్లంలో కూడా చదువగలరు - I Discovered True Salvation.


వారెందుకు మారారు?

ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు