ప్రభువైన యేసు క్రీస్తు జన్మము, జీవితము, మరణము, మరియు ఆరోహణమును గూర్చి అల్ - తబరి చేసిన వ్యాఖ్యానము

శాం షమూన్ 

యేసుక్రీస్తు చనిపోలేదు సిలువ కూడా వేయబడలేదు అని ఆధునిక ముస్లింలు ఆరోపించటం సాధారణముగా మనం వింటూనే ఉంటాము. సూరా 4:157ను ప్రామాణికముగా చూపుతూ యేసుక్రీస్తు రూపము ఇస్కరియోతు యూదాపైకి మార్పిడి చేయబడింది అని వారు చెప్పుట కూడా సాధారణముగా వింటూనే ఉంటాము. అంతే కాకుండా, యూదా ఒకసారి యేసువలె కనబడునట్లుగా చేయబడుటవలన ప్రజలు పొరపాటుగా క్రీస్తు స్థానములో ఆయనను సిలువ వేశారు; అందువలన జనసామాన్యము వాస్తవముగా క్రీస్తునే సిలువ వేస్తున్నాము అని అనుకొన్నారు అని కూడా వారు నమ్ముతారు.  

విచారకరముగా, ఆదిమ ముస్లిం మూలాధార పుస్తకాలలో అటువంటి అభిప్రాయములకు చాలా కొద్దిపాటి ఆధారం కూడా దొరుకదని చాలా మందికి తెలియదు. నిజానికి, ఆదిమ ముస్లిం పండితులందరూ యేసుక్రీస్తు చివరి దినముల గురించి విభేదిస్తూ భిన్నవిభిన్న విశ్వాసాలతో పరస్పర విభేదములు కలిగి ఉన్నారు. ఆదిమ ముస్లిం పండితులందరు కూడా ఒకే అభిప్రాయానికి కట్టుబడియుండక, కొంతమంది క్రీస్తు వాస్తవముగా చనిపోయారు అని నమ్ముతుంటే మరికొందరు దేవుడు ఆయనను చనిపోనియ్యకుండా తిన్నగా పరలోకమునకు  తీసేసుకున్నాడు అని పలు అభిప్రాయ భేదాలు కలిగి ఉండటము గమనార్హము.  

ఉదాహరణకు, నేటి ముస్లింలు చెప్పే ఉద్దేశాలకు పూర్తి భిన్నమైన వేరే ఉద్దేశమునకు కట్టుబడియున్న అబు జాఫర్ ముహమ్మద్ బిన్ జరీర్ అల్ - తబరి (839-923) అనే ఒక ఆదిమ ముస్లిం పండితుడున్నాడు. సాధారణముగా, అల్-తబరి అని పిలువబడే ఇతను, సృష్టి నిర్మాణక్రమముతో ప్రారంభిస్తూ ''ప్రవక్తలు మరియు రాజుల చరిత్ర'' (తా'రీఖ్ అర్రుసుల్ వ'ల్ ములూక్ అను పేరు మీద ఒక సమగ్ర చరిత్ర పుస్తకాన్ని వ్రాశాడు. యేసుక్రీస్తు జన్మము, జీవితము, మరణము, మరియు ఆరోహణములపైన అల్-తబరి చెప్పిన దానిని ఈ వ్యాసములో ఉటంకించుచున్నాము. మోషే పెర్లమన్ ఇంగ్లీషులోనికి అనువాదం చేసిన - ''ద హిస్టరీ ఆఫ్ అల్-తబరి'', సంపుటి IV, ది ఎంషియంట్ కింగ్డమ్స్ ( స్టేట్ యూనివర్సిటి ఆఫ్ న్యూయార్క్ ప్రెస్అల్బనీ1987అను గ్రంథములోని మాటలను మేము ఇక్కడ తెనిగించి ఉపయోగిస్తున్నాము.

''ముతన్నా ఇస్‌హాక్ బిన్ అల్ హజ్జాజ్ ఇస్మాయీల్ బిన్ అబ్ద్ అల్ కరీం అబ్ద్ అల్ సమద్ బిన్ మాకిల్ వహ్బ్ ప్రకారముగా: మరియ కుమారుడైన యేసు ఈ లోకమును విడచిపెట్టవలసియున్నదని దేవుడు తనతో  చెప్పినప్పుడు, తన మరణమును గురించి భయాక్రాంతుడై దుఃఖపడ్డాడుఅతడు అపొస్తలులను సమావేశపరచి వారికి భోజనము సిద్ధపరచి వారితో ''ఈ రాత్రి నా యొద్దకు రండి'' అని చెప్పాడు. వారు రాత్రివేళ కూడివచ్చినప్పుడు, వారికి భోజనము వడ్డించాడు. వారు భోజనము చేసిన తరువాత వారి చేతులను కడిగితన చేతులతో శుద్ధిచేస్తూతన వస్త్రముతో వారి చేతులను తుడుచుట ప్రారంభించాడుఅయితే వారు ఇది చాలా దుస్సహమైనదిగా పరిగణించి అయిష్టపడిరి. అప్పుడు యేసు - ''ఈ రాత్రి నేను మీకు చేసిన దానిని తృణీకరించువాడునిజముగా నావాడు కాడుమరియు నేను అతడివాడను కాను'' అని చెప్పెనుమరియు యేసు - ''ఈ రాత్రి మీకు భోజనమును వడ్డించినా చేతులతో మీ చేతులను కడిగి నేను మీకు చేసినది మిమ్ములను నాతో సమానముగా చేయుటకేమీరు నన్ను మీ మధ్య అత్యంత ప్రముఖునిగా పరిగణించారుకావున మీరు ఒకరియెడల మరొకరు అహంకారులుగా ఉండకుడినేను మీ కొరకు బలిదానమౌ రీతిగానే మీరును ఒకరికోసమై మరొకరు బలిదానమవ్వండి. మీతో నేను చేసే మనవి ఏమంటే - మీరు దేవునికి మొఱ్ఱపెట్టండి; నా మరణమును వాయిదా వేయమని మనఃపూర్వముగా దేవునికి మొఱ్ఱపెట్టండి''. వారు ఆసక్తి కలిగి ప్రార్థన చేయుటకు మళ్ళినను, నిద్రబోయి ప్రార్థన చేయలేకపోయారు. ఆయన వారిని నిద్రలేపుతూ - ''దేవునికి స్తుతి కలుగునుగాక, నాకు సహాయము చేయుటకు ఒక్క రాత్రి మేల్కొనియుండలేరా?'' అని అడిగాడు. అందుకు వారు - ''దేవుని తోడు, మాకేమి జరిగిందో మాకు తెలియలేదు, మేము  జాగరణము చేస్తూనే ఉన్నాము కానీ, ఈ రాత్రి మెలకువగా ఉండలేక పోవుచున్నాము. మేము ప్రార్థించుటకు ప్రారంభించగానే, అలా చేయకుండా మేము ఆటంకపరచబడుచున్నాము'' అని అన్నారు. అప్పుడు ఆయన వారితో - ''కాపరి తీసివేయబడగా, గొర్రెలు చెదరిపోవును'' అని అన్నాడు.

తన మరణమును గురించి అలా ప్రకటిస్తూవారితో ఇలా అన్నాడు- ''కోడి కూయక ముందే మూడుసార్లు మీలో ఒకడు నన్ను తృణీకరిస్తాడు, మరొకడు కొన్ని నాణెములకు నన్ను అమ్ముకుంటాడు, మరియు నా వెలను తింటాడు''. వారు వెలుపలికి వచ్చి ఎటువారు అటు వెళ్ళిపోయారు. యూదులు ఆయన కొరకు వెదకుచుండిరి. వారు అపొస్తలులలో ఒకడైన సీమోనును పట్టుకొని - ''ఇతడును ఆయన అనుచరుడే'' అనిరి. కాని అతడు ఆ మాటను తృణీకరించి - ''నేను ఆయన అనుచరుడను కాను'' అనెను. అందుకు వారు అతనిని వదిలేశారు. తరువాత వేరొకడు అతనిని పట్టుకొనెను, కాని మరలా అతడు తృణీకరించి బొంకాడు. అప్పుడు కోడి కూయగా అతడు విని యేడ్చెను. ఉదయమవగానే, అపొస్తలులలో ఒకడు యూదులయొద్దకు వచ్చి - ''మిమ్ములను నేను క్రీస్తు నొద్దకు నడిపించినయెడల మీరు నాకు ఏమిస్తారు?'' అని అడిగెను. అప్పుడు వారు అతనికొరకు ముప్పది వెండి నాణెములు నిర్ణయించిరి. అతడు వాటిని తీసికొని, ఆయన యొద్దకు వారిని నడిపించాడు. ఇంతకుముందైతే వారికి క్రీస్తు ఎవరో సరిగా తెలియదు. కానీ ఇప్పుడు ఆయనను పట్టుకొని సంకెళ్ళతో బంధించి, త్రాడుతో కట్టివేశారు, మరియు ఆయనను తీసుకెళుతూ - ''నీవు చనిపోయినవారిని లేపావు, దయ్యములను వెళ్ళగొట్టావు, మరియు పీడించబడుచున్న వారిని బాగుచేశావు గదా, ఈ త్రాడునుండి నిన్ను నీవు విడిపించుకొనలేవా?'' అనిరి. అతనిని దేనిమీదనైతే సిలువ వేయాలని తలంచారో ఆ కొయ్యను తెచ్చే పర్యంతము కూడా ఆయన మీద ఉమ్మివేస్తూ ముళ్ళు విసిరారు. కానీ దేవుడు ఆయనను తన యొద్దకు తీసుకొన్నాడు; మరియు ''వారు వారికి చూపింపబడిన రూపమును'' మాత్రమే సిలువ వేసిరి. ఒక వారము గడచిన పిదప ఆయన తల్లియు మరియు ఆయన పిచ్చితనం నుండి స్వస్థపరచిన మరియొక స్త్రీయు అయనను సిలువ వేసిన స్థలమునొద్దకు ఏడ్చుకుంటూ వచ్చిరి. అయితే యేసు వారియొద్దకు వచ్చి - ''మీరు ఎందుకు ఏడ్చుచున్నారు?'' అని అడుగెను. వారు - ''నీ కోసమే'' అనిరి. అంతట ఆయన - ''దేవుడు నన్ను తన యొద్దకు తీసుకున్నాడు, నాకు కేవలం మంచే జరిగింది. వారికైతే కేవలము ఒక రూపము మాత్రమే చూపబడింది. కాబట్టి ఫలాని ఫలాని స్థలమందు నన్ను కలువమని అపొస్తలులను ఆదేశించండి'' అని అనెను. యేసునొద్దకు యూదులను నడిపించి ఆయనను అప్పగించిన ఆ ఒక్కడు తప్పిపోగా, మిగిలిన పదకొండుమంది వెళ్ళి ఆ స్థలమందు ఆయనను కలిసికొనిరి. యేసు అతని గురించి అపొస్తలులను అడుగెను. వారు - ''అతడు చేసిన దానికి శోకించి, ఉరి పెట్టుకొని చనిపోయాడు'' అని చెప్పిరి. యేసు - ''అతను పశ్చాత్తాపపడితే, దేవుడు క్షమించి యుండేవాడు'' అని అనెను. వారిని వెంబడించుచున్న యువకుడైన యోహాను గురించి ఆయన  వారిని అడిగి - ''ఆయన మీకు తోడుగా ఉన్నాడు. వెళ్ళుడి! మీలో ప్రతి ఒక్కడు ఏ ప్రజలను హెచ్చరించుటకు మరియు పిలుచుటకు వెళతారో, ఆ ప్రజల భాషలో మాటలాడుదురు'' అని చెప్పెను

ఇబ్న్‌హుమైద్ ఇబ్న్‌ఇస్‍హాక్ - తప్పుపట్టవీలులేని అధికారం గలిగిన - వాహ్బ్‌బిన్‌మునబ్బిహ్‌అల్‌యమాని చెప్పిన ప్రకారముగా - మరియ కుమారుడైన యేసును పగలు మూడు గంటలకు చనిపోవుటకు దేవుడు అనుమతించాడు; తరువాత తనయొద్దకు ఆయనను తీసుకున్నాడు.

ఇబ్న్‌హుమైద్ సలమహ్ ఇబ్న్‌ఇస్‍హాక్ చెప్పిన ప్రకారముగా - ఒక రోజులోని ఏడు గంటల వ్యవధిపాటు (ఏడు గంటలసేపు) ఆయన చనిపోవుటకు దేవుడు సమ్మతించాడు, ఆ తరువాత ఆయనను తిరిగి మృతులలోనుండి లేపి ఇలా అన్నాడు -''తన పర్వతము మీదనున్న మగ్దలేనే మరియ నొద్దకు దిగివెళ్ళు, ఆమె ఏడ్చినట్లు ఎవ్వరూ నీకొరకు ఏడువలేదు, మరియు ఆమె దుఃఖించినట్లు ఎవ్వరూ నీకొరకు దుఃఖించలేదు. నీ కొరకు అపొస్తలులను సమకూర్చమని ఆమెతో చెప్పు. నీవు ఆ పనిని చేయలేదు గనుక, అమెనే వారిని దేవుని కొరకు బోధకులుగా పంపించనివ్వు''. దేవుడు ఆయనను క్రిందకు ఆమె యొద్దకు పంపాడు; ఆయన దిగివెళ్ళగా పర్వతము కాంతిచేత ప్రకాశించింది; మరియ అపొస్తలులను సమకూర్చినది. యేసు తన నామములో దైవాజ్ఞను ప్రజలకు చెప్పమని వారికి ఆజ్ఞాపించాడు. పిదప దేవుడు యేసును తన యొద్దకు తీసుకున్నాడు, ఆయనకు దేవదూతల రెక్కలను ఇచ్చి ప్రకాశమానమైన వస్త్రము తొడిగినాడుఇక ఎన్నడూ యేసు ఆహారముగానీనీరుగానీ రుచి చూడలేదుసింహాసనము చుట్టూ దేవదూతలతో కలిసి ఆయన కూడా ఎగురుచూ ఉన్నాడు.

ఆయన మానవుడు మరియు దేవదూతా స్వరూపుడుస్వర్గసంబంధియైనవాడు మరియు భూసంబంధియైనవాడు కూడాఅపొస్తలులు తమకు ఆజ్ఞాపించబడినరీతిగా వెళ్ళిపోయిరి. యేసు దిగివచ్చిన ఆ రాత్రిని క్రైస్తవులందరు సాంబ్రాణితో పండుగగా జరుపుకుంటారు.'' (అల్ తబరి, 120-123 పేజీలు;) 

యేసుక్రీస్తు చివరి దినములపైన అల్ తబరి యొక్క మాటలను క్లుప్తముగా చూస్తే, మనకు ఇవి అర్థమగుచున్నవి:-

A) ఈ లోకమును విడువవలసినదిగా యేసుకు తెలియచెప్పబడినది.

B) ఈ వార్త అందగానే, యేసు చనిపోవడానికి భయపడ్డాడు. ఇది క్రీస్తు చనిపోతున్నాడు అని సూచిస్తుంది. క్రీస్తు చనిపోవుట దేవుని ఉద్దేశము కానియెడల యేసుక్రీస్తు ఎందుకు అంతగా తన మరణము గురించి భయపడాలి? 

C) తనను వెంబడించుచున్న వారిచేత విసర్జించబడి అప్పగించబడుచున్నాను అని యేసు తన శిష్యులకు తెలియజేశాడు.

D) మరణమునుండి తప్పించబడుటకు ప్రార్థన చేయమని యేసు తన శిష్యులను అడిగాడు. ఇది క్రీస్తు వాస్తవముగా చనిపోతున్నాడని మరియొకసారి రుజువుపరుస్తుంది. లేదంటే క్రీస్తు తన మరణమునుండి తప్పించబడుట కొరకు తన శిష్యులని ప్రార్థించమని అడగటం ఖచ్చితంగా అర్థరాహిత్యమే అవుతుంది. కాబట్టి మొదట తాను  చనిపోనిదే దేవుడు తనను పరలోకమునకు తీసుకోడని క్రీస్తే చెప్పిన సంగతిని ఇది బలముగా చూపెడుతుంది. 

E) యేసు సిలువ వేయబడుటకు తీసుకొని పోబడుచున్నపుడు కొట్టబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, అతని మీదకు ముళ్ళు విసిరి కొట్టబడినవి. 

F) అప్పుడు దేవుడు యేసును పైకి తీసుకున్నాడు, మరియు క్రీస్తు యొక్క రూపము మాత్రమే సిలువ వేయబడింది. 

యేసుక్రీస్తు సజీవునిగా పరలోకానికి ఆరోహణుడు కాకముందు ఆయన సిలువలో మరణించాడని అల్ తబరి నమ్మటం లేదు గదా అని ఎవరైనా పొరపాటున అనవచ్చు. అయితే వేరొక చోట అతడు ఏమన్నాడో గమనించండి:

''ఇబ్న్ హుమైద్ సలమహ్ ఇబ్న్ ఇస్‍హాక్ ఉమర్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఉర్వహ్ బిన్‌అల్ జుబైర్ ఇబ్న్ సులైం అల్ అన్సారి అల్ జురాకి చెప్పిన ప్రకారము: మదీనా దగ్గర అకీక్‍లో ఉన్న అల్ జమ్మ అను ఒక పర్వతమునకు వస్తానని మా స్త్రీలలో ఒకతె మ్రొక్కుబడి చేసికొనగా నేను ఆమెతో కూడ వెళ్ళాను. మేము ఆ పర్వతముపైన నిలబడ్డప్పుడు, ఇదిగో మేము చూడగా, తల వైపున ఒకటి కాళ్ళ వైపున ఒకటి మొత్తము రెండు పెద్ద పెద్ద రాతి పలకలు పెట్టబడియున్న ఒక పెద్ద సమాధి మాకు కనిపించినది. ఆ రాతి పలకలపైన పురాతన లిపిలో (ముస్నద్‌లో) ఏదో వ్రాయబడియున్నది; నేను దానిని చదువలేకపోయాను. నేను వాటిని నాతోపాటు కొండదిగువకు సగము దూరము మోసుకొని వచ్చితిని, అవి చాలా బరువుగానున్నందున ఒక దానిని అక్కడనే పడవేసి మరొక దానిని తీసుకొని క్రిందకు దిగివచ్చితిని. ఒకవేళ సిరియనుల లిపి చదవగలిగిన వారికి ఈ లిపి తెలుసునేమోనని దానిని వారికి చూపితిని; కాని వారు కూడా చదువలేకపోయారు. నేను ఆ పలకను ముస్నద్‌లిపి బాగుగా తెలిసినవారును మరియు కీర్తనలు (జబూర్) ప్రతులు వ్రాసేడి వారైన యమన్‌ ప్రాంత వాసులకు చూపించాను; కాని వారు కూడా దానిని గుర్తించలేదు.

ఇది తెలిసిన వారు ఎవరును లేరని నేను తెలిసికొని, మా ఇనప్పెట్టె (భోషాణము) క్రిందకు దానిని విసిరితిని. అది అక్కడనే అనేక సంవత్సరముల పాటు ఉండిపోయింది. తరువాత ఒకప్పుడు పర్షియాలోని మాహ్‌ప్రాంతము నుండి కొంతమంది ముత్యములను కొనవెదకుతూ మా యొద్దకు వచ్చిరి. నేను వారితో ''మీకు లిపి ఉన్నదా?'' అని అడిగితిని. ''అవును ఉన్నది'' అని వారన్నారు. నేను వారి యొద్దకు ఆ రాతిని తీసుకొని రాగా, ఇదిగో వారు దానిని చదివినారు. దానిపై వారి లిపిలో ఇలా వ్రాయబడియున్నది - ''ఇది ఈ దేశ ప్రజలకు వార్తావహుడునుమరియ కుమారుడునునైన యేసు సమాధి'', ఆ కాలంలో ఆ ప్రాంతంలో వారే నివసిస్తుండేవారు. వారి మధ్యన ఆయన మరణించాడువారు ఆయనను పర్వతశిఖరము పైన సమాధి చేశారు.

ఇబ్న్ హుమైద్ సలమహ్ ఇబ్న్ ఇస్‍హాక్ ప్రకారము:- మిగిలిన అపొస్తలులను కూడా కొట్టి, బహు కిరాతకంగా హింసిస్తూ, అవమానకరంగా  ఎండలో ఊరేగించారు. వారిని పరిపాలించుచున్న రోమా రాజు ఇది విన్నాడు. అతడు విగ్రహారాధికుడు. అతనికి చెప్పబడినది ఏమనగా, తన పరిపాలన క్రింద ఉన్న ఇశ్రాయేలీయులలో ఒకడు బాధింపబడి చంపబడ్డాడు. తాను దేవుని వార్తావహుడనని అతడు ఆ ప్రజల మధ్య  ప్రకటించాడు. అతడు అద్భుతకార్యములను చేశాడు, మృతులను లేపాడు మరియు రోగులను స్వస్థపరిచాడు. అతడు మట్టితో ఒక పక్షిని చేసి, దానిలోనికి ఊపిరిని ఊదగా, దైవానుగ్రహమున అది ఎగిరిపోయింది. రహస్యముగా (దాచబడి) ఉన్నవాటిని వారికి చెప్పేవాడు. ఆ మాటలను విన్న రాజు గొప్ప కేకవేసి - ''మీరు అతడి గురించికాని ఆ ప్రజల గురించికాని నాకెందుకు చెప్పలేదు? దేవుని్తోడు, నాకు ముందే తెలిసియుండుంటే అతని మీదకు వారి చేతులనెత్తనిచ్చేవాడను కాను!'' అని అన్నాడు. అప్పుడు అతడు అపొస్తలులకొరకు మనుష్యులను పంపి ఇశ్రాయేలీయుల చేతిలోనుండి వారిని తప్పించాడు. యేసునందలి విశ్వాసము గురించి మరియు అతనికి సంభవించినదాని గురించి అపొస్తలులను అడిగి తెలుసుకొన్నాడు. వారతనికి తెలియచేయగా వారి విశ్వాసమును అతడు కూడా స్వీకరించాడు. అప్పుడు సెర్గియస్‌అనబడు ఒకనిని రాజు విడుదలచేసి, దాచిపెట్టాడు. యేసును సిలువ వేసిన ఆ కొయ్య సిలువను అతడు తీసుకొని, యేసు దానిని తాకెనని దానిని సన్మానముగా భద్రపరిచాడు. ఆ విధముగా రాజు ఇశ్రాయేలీయులకు శత్రువుగా మారి, వారిలో అనేక మందిని చంపాడు. అప్పటినుండి రోమాలో క్రైస్తవ్యము విస్తరించింది." (అల్‌-తబరి, పేజీలు 123-124;)

యేసు సిలువ మీద మరణించాడు అని అల్‌-తబరి వాస్తవముగా నమ్మాడని ఈ ఆధారాలలో మనకు రూఢిగా తెలుస్తున్నది. ఇదియుగాక యేసుక్రీస్తు సిలువలో మధ్యహ్నం మూడు గంటలకు చనిపోయాడు ఆ తరువాత దేవుడు ఆయనను తనయొద్దకు తీసుకున్నాడు అని ప్రముఖ ఖురాన్ వ్యాఖ్యానకర్త ఇబ్న్ అబ్బాస్‍కు శిషుడైన వహ్బ్ బిన్ మునబ్బిహ్‌రూఢిగా చెప్పిన ఐతిహ్యమును తబరి కూడా ఉటంకించుట ద్వారా ఈ విషయము మరింత బలంగా  రుజువుపరచబడింది.

కాబట్టి ఇక్కడ మనకు తెలుస్తున్నదేమనగా, సూరా 4:157 ద్వారా కలిగిన గందరగోళము వలన, యేసు సిలువలో మరణించాడు అని బహుశా స్పష్టముగా అల్‌తబరి చెప్పలేకపోయుండొచ్చు. అలా చెప్పుంటే మాత్రం ఖురాన్‌బోధను తృణీకరించినవాడుగా అతని మీద పెద్ద నేరమే మోపుండేవారు.

G) యేసును తృణీకరించిన అపరాధ భావముతో యూదా ఉరి పెట్టుకొని చనిపోయాడు. అల్‌-తబరి వేరొక చోట ఈ సంగతి వ్రాస్తూ అతడు మరెవరో కాదుగాని స్వయంగా యూదానే అని మనకు సమాచారమిస్తున్నాడు. 

"అపొస్తలులు, వారి తరువాత వచ్చిన అనుచరులలో పేతురు మరియు పౌలు ఉన్నారు. పౌలు అనుచరుడు మాత్రమే కాని అపొస్తలుడు కాదు; వారు రోమునకు వెళ్ళిరి. అంద్రెయ మరియు మత్తయి నరమాంసభక్షకులైన నల్లజాతీయుల యొద్దకు పంపబడ్డారు అని మేము అనుకుంటున్నాము; తోమా తూర్పున ఉన్న బబులోనుకు పంపబడ్డాడు, ఫిలిప్పు ఉత్తర ఆఫ్రికాలోని కైరవాన్‌(మరియు) కర్తాజ్ నగరాలకు పంపబడ్డాడు. గుహలో నిద్రించిన యౌవనుల కథకు ప్రసిద్ధ పట్టణమైన ఎఫెసుకు యోహాను వెళ్ళెను, మరియు యాకోబు ఆలియా అను మారుపేరు కలిగిన యెరూషలేమునకు వెళ్ళెను. బర్తొలొమయి హిజాజ్‌అని పిలువబడే అరేబియాకు పంపబడెను; సీమోను ఆఫ్రికాలోని అనాగరికుల మధ్యకు పంపబడ్డాడు. యూదా ఇకమీదట అపోస్తలుడుకాడు కనుక, అతడి స్థానము అరియోబుకు ఇవ్వబడింది. ఇస్కరియోతు యూదా నేరం చేసిన తరువాత అతడి స్థానమును ఇతడు భర్తీ చేశాడు." (అల్‌-తబరి 123వ పేజి).

క్రీస్తు స్థానములో సిలువ వేయబడుటకు యూదా యేసువలె మార్చబడ్డాడు లేక అగుపర్చబడ్డాడు అని నేటి ఆధునిక ముస్లింలు యూదాను గురించి చెప్పుచున్న అబద్ధం అల్‌-తబరి చేసిన రచనలలోనే కాకుండా అతడు ప్రస్తావించిన ప్రాచీన మూలాధార రచనలలో కూడా మనకు కనిపించకపోవటం చూస్తే ఆ అబద్ధప్రచారం బహుశా వారికి తెలిసుండకపోవచ్చు లేదా వారు దానిని పూర్తి అసత్యముగా భావించి తృణీకరించైనా ఉండాలి అని మనకు తెలుస్తున్నది.

ఇక ముందుకు కొనసాగితే, నిజానికి క్రైస్తవులు చెప్పిన దానిని మరియు నాలుగు సువార్తలలో యేసుక్రీస్తు పుట్టుక మరియు వంశావళి గురించి వ్రాయబడిన సమాచారమును, అదే విధంగా క్రొత్తనిబంధనకు అంటగట్టబడిన కొన్ని అప్రమాణిక గ్రంథాలలో ఉన్న చెప్పుడు కథలను కూడా అల్‌తబరి ప్రస్తావించాడు అని మనం సులభముగానే కనుగొ్నగలం:- 

"అలెగ్జాండర్ బబులోనును పట్టుకొనిన అరువది అయిదు సంవత్సరముల తరువాత, అనగా అర్సాసిద్‌ఏలనారంభించిన యాభైఒక్క సంవత్సరములకు, ఇమ్రాన్ కుమార్తెయైన మరియ యేసుకు జన్మనిచ్చింది అని పర్షియన్లు చెబుతారు. కాని క్రైస్తవులు మాత్రం అలెగ్జాండర్ బబులోనును జయించిన 303 సంవత్సరములకు యేసు జన్మించాడనిమరియు బాప్తిస్మము ఇచ్చు యోహాను యేసుకు ఆరు నెలలు ముందుగా జన్మించాడని చెబుతారుమరియ యేసును గర్భమున ధరించినప్పటికి ఆమె వయస్సు పదమూడు సంవత్సరములు అని తెలియజేస్తారు. యేసు తన ఆరోహణమునకు ముందు ముప్పది రెండు సంవత్సరముల కొన్ని దినములు జీవించాడని, ఆయన ఆరోహణుడైన తరువాత మరియ ఇంకొక ఆరు సంవత్సరములు అనగా మొత్తము యాభై సంవత్సరములు జీవించిందని కూడా తెలియజేస్తారు. యేసు ముప్పది సంవత్సరముల వయస్సు వాడైనప్పుడు యొర్దాను నది యొద్ద యోహానును కలుసుకొనెనని, ఆ యోహాను యేసు ఆరోహణమునకు ముందే చంపబడెనని చెబుతారు. యహ్యా బిన్‌జెకర్యా తండ్రియైన జెకర్యా బిన్‌బెరెక్యా, మరియు మరియ తండ్రియైన ఇమ్రాన్‌ బిన్‌మత్తన్ఇరువురు వెళ్లి అక్కచెల్లెండ్రను వివాహము చేసికొనిరి. జెకర్యాను వివాహము చేసికొన్న స్త్రీ యోహానుకు తల్లి, ఇంకొకతె ఇమ్రాన్‌బిన్‌మత్తన్‌‍ను చేసికొంది, ఆమె మరియకు తల్లి. మరియ తన తల్లి గర్భమందు ఉన్నప్పుడే ఇమ్రాన్‌ బిన్‌మత్తన్‌ చనిపోయాడు. మరియ పుట్టిన తరువాత, తన తల్లి మరణానంతరం తన పెద్దమ్మ (అనగా తన తల్లికి అక్క) జెకర్యాతో కూడా ఉన్నది కాబట్టి అతడే ఆమెను పోషించాడు. మరియ తల్లి పేరు హన్నా బిన్త్‌ఫాఖూద్‌బిన్‌ఖాబీల్‌. మరియ తల్లి సహోదరి (పెద్దమ్మ) పేరు అనగా యోహాను తల్లి పేరు ఎలీసబెత్ బిన్త్‌ఫాఖూద్‌. మరియను జెకర్యా పోషించేవాడు. ఆమె యూసుఫ్ బిన్‌యాకోబ్ బిన్‌మత్తన్‌బిన్‌ఎలీయెజెర్ బిన్‌ఎలీహూద్ బిన్‌అకీం బిన్‌సాదో్క్ బిన్‌ఆసోర్ బిన్‌ఎల్యాకీం బిన్‌అబీహూద్‌బిన్‌జెరుబ్బాబేల్ బిన్‌షయల్తీయేల్ బిన్‌యెకొనియ బిన్‌యోషియా బిన్‌ఆమోన్ బిన్‌మనష్షే, బిన్‌హిజ్కియా బిన్‌అహజ్యా బిన్‌యోతాం బిన్‌ఉజ్జియా బిన్‌యెహోరాం బిన్‌యెహోషాపాత్ బిన్‌ఆసా బిన్‌అబీయా బిన్‌రెహాబాం బిన్‌సులైమాన్ బిన్‌దావూద్‍నకు ప్రదానము చేయబడినది.

ఇబ్న్ హుమైద్ సలమహ్ ఇబ్న్ ఇస్‍హాక్ ఇలా అంటాడు: ఆమె వంశావళి గురించి నాకు తెలిసినంతవరకు, మరియ ఇమ్రాన్ బిన్‌యోషీయా బిన్‌అమజ్యా బిన్‌యోవాష్ బిన్‌అహజ్యా బిన్‌యెహోరాం బిన్‌యెహోషాపాత్ బిన్‌ఆసా బి న్‌అబీయా బిన్‌రెహబాం బిన్‌సులైమాన్ కూతురు.

మరియ కుమారుడైన యేసుకు (పెద్ద) అమ్మమ్మ కుమారుడుగా యోహాను జెకర్యాకు జన్మించాడు. యోహాను తన యౌవ్వన వయసులోనే ప్రవక్తయై సంచరించుచూ ఉండెను. అతడు పాలస్తీనుకు వచ్చి ప్రజలను దర్శించుచుండెడివాడు. బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసు ఒకనాడు కలిసికొని, యోహాను చేత యేసు బాప్తిస్మము తీసుకొనిన తరువాత వారు సెలవు పుచ్చుకొని విడిపోయారుప్రజలకు బోధించడానికి యోహానుతో పండ్రెండుమంది అపొస్తలులనిచ్చి యేసు వారిని పంపించాడని అంటారు. తోడబుట్టిన వారి పిల్లలను వివాహము చేసుకోవడం వారికి నిషిద్ధం. (అల్-తబరి, 102-103 పేజీలు)

అల్‌తబరి ఇచ్చిన యోసేపు వంశావళి వాస్తవానికి మన మత్తయి సువార్తలో నుండి తీసికొని చెప్పబడినదే:- 

"అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను; యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను; పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను; నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెనుదావీదు ఊరియా భార్యగానుండిన ఆమెయందు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను, యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను; యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను." (మత్తయి సువార్త 1:1-16)

అల్‌తబరి నుంచి అదనంగా:

ఔగుస్తు (అగస్టస్) చక్రవర్తియైన తరువాత నలుబది రెండు సంవత్సరములకు యేసు పుట్టాడు అని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. ఔగుస్తు ఇంకనూ జీవిస్తూ మొత్తానికి యాభై ఐదు సంవత్సరములు పరిపాలించాడు, కొంతమంది మరికొన్ని ఎక్కువ దినములు పరిపాలించాడని కూడా అంటారు. యూదులు యేసును హింసించారు. ఆ సమయములో కైసరు (సీజర్) యెరూషలేమును పరిపాలించుచుండిన చక్రవర్తి, అతడి ప్రతినిధిగా యెరూషలేములో హేరోదు ఏలుచుండెను. అతడి యొద్దకు పర్షియా రాజు యొక్క దూతలు వచ్చిరి. క్రీస్తునొద్దకు పంపబడితే, వారు పొరబాటున హేరోదు నొద్దకు వచ్చిరి. వారు తెచ్చిన కానుకలను అనగా బంగారమును సాంబ్రాణిని బోళమును క్రీస్తునకు అర్పించడానికి తమను పర్షియా రాజు పంపినట్లు హేరోదునకు తెలిపిరి. క్రీస్తు తార వెలసిన సంగతిని తమ లెక్కల ప్రకారం గ్రహించామని చెప్పిరివారు ఆయనకు  పాలస్తీనులోని బేత్లెహేములో కానుకలనర్పించిరివారిని గురించి హేరోదు తెలిసికొని, క్రీస్తునకు విరోధముగా కుట్రపన్నిఆయనను సంహరిచుటకొరకై వెదకెను. అయితే హేరోదు శిశువును సంహరింపనుద్దేశించుచున్నందున, శిశువును అతని తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోవలసినదిగా తెలియజేయుటకై మరియతో పాటుగా దేవాలయములోనున్న యోసేపు నొద్దకు దేవుడు తన దూతను పంపెను.

హేరోదు చనిపోయిన తరువాత, ఐగుప్తునందున్న యోసేపుతో దేవదూత ఇలా అనెను - ''హేరోదు చనిపోయాడు మరియు ఆర్కెలాయు తన తండ్రికి బదులుగా ఏలుచున్నాడు, శిశువును సంహరింపజూచినవాడు ఇక జీవించిలేడు.'' అప్పుడు యోసేపు శిశువును తోడుకొని, 'ఐగుప్తులోనుండి నేను నిన్ను పిలిచితిని' అని ప్రవక్తయైన యెషయా చెప్పిన మాట నెరవేరునట్లుపాలస్తీనులోని నజరేతుకు వచ్చెనుర్కెలాయు మరణించిన తరువాత, తనకు మారుగా చిన్న హేరోదు రాజాయెను, అతని కాలములో యేసుక్రీస్తు యొక్క రూపము సిలువ వేయబడింది(అల్‌తబరి, 124-125 పేజీలు)

పాద సూచికలో ఇలా వ్రాయబడింది:

"ఇక్కడ యెషయాకు ఆపాదించబడిన ఉల్లేఖనము హోషేయ 11:1 లో ఉన్నది." (అల్‌తబరి, 322, 125 పేజీ)

అల్‌తబరి ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయముపై పూర్తిగా ఆధారపడి, ఇది వాస్తవమైన చరిత్ర అని చెబుతున్నాడు.

 

అనుబంధము 

ఖురాన్‍లోని తవఫ్ఫా అను మాటకు అర్థము

ఖురాన్ ప్రకారము యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణుడవడానికి ముందే చనిపోయాడు:

"ఇదిగో! దేవుడు ఇలా అన్నాడు: ఓ యేసూ, నిశ్చయముగా నేను నిన్ను మరణింపజేస్తాను (ముతవఫ్ఫీక), నా యొద్దకు ఎత్తుకొందును, సత్యమును తృణీకరించు వారి యొద్దనుండి నిన్ను పావనం చేస్తాను; నిన్ను అనుసరించు వారిని పునరుత్థాన దినమున సత్యమును తృణీకరించు వారికంటే పైగా ఉంచుదును. మీరందరు చివరకు నా యొద్దకు రావలసిందే, మరియు నేనే మీరు కలహించుచున్న విషయమును గూర్చి తీర్పు తీర్చుదును." (సూరా 3:55)

"మీరు ఆదేశించిన విషయాలే నేను వారికి బోధించాను. నా ప్రభువు, మీ ప్రభువు అయిన దేవుడిని మాత్రమే ఆరాధించుడని నేను వారికి చెప్పాను. వారి మధ్య జీవించి్యున్నంత వరకే నేను వారిని కనిపెట్టుకొని ఉన్నాను. మీరు నన్ను పైకెత్తుకున్న తరువాత (తవఫ్‌ఫైతని) [మరణింపజేసిన తరువాత అని ఇంగ్లీషులో షాకిర్ అనువాదంవారిని మీరే కనిపెట్టుకొని ఉన్నారు. మీరు అందర్నీ, అన్ని విషయాల్నీ (అన్ని వేళలా) కనిపెడ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వారిని శిక్షిస్తే వారు మీ దాసులే. ఒకవేళ క్షమిస్తే మీరు ఎంతో శక్తిమంతులు, మహా వివేకవంతులు." (సూరా 5:117) 

ముతవఫ్ఫీక , మరియు తవఫ్‌ఫైతని అనే పదాలు, మూలరూప పదమైన తవఫ్‌ఫా అనే క్రియాపదము నుండి వచ్చినవి. దేవుడు లేక దూతల గురించి ప్రస్తావించేటప్పుడెల్లా ఈ క్రియాపదము “మరణము” అనే అర్థాన్నే ఇస్తుంది. కావున క్రీస్తు దేవుని యొద్దకు ఎత్తబడక ముందే చనిపోయాడు అని ఖురాన్ స్పష్టముగా బోధిస్తున్నట్లు ఇక్కడ అర్థమగుచున్నది. ఇదేదో కేవలం క్రైస్తవుల కట్టుకథ అని ఎవరైనా అనడానికి పూనుకోవచ్చు, కనుక ఈ క్రింద మేము రెండు ముస్లిం ఆధారాల నుండి వ్యాఖ్యానాలను ఇస్తున్నాము. 

ముతవఫ్ఫీక అను ఈ పదము "తవఫ్‌ఫ" అను నామవాచకము నుండి తీయబడిన సక్రియాత్మక అసమాపక క్రియాపదము (ఇస్మ్ అల్ ఫాఇల్). ప్రామాణికమైన అరబీ నిఘంటువులలో ఒకటైన అక్రబ్‌అల్‌-మవారిద్‌ అనే నిఘంటువులో "తవఫ్ఫ" అనే పదమునకు ఈ క్రింది అర్థము ఇవ్వబడినది - 

"ప్రమాణము", "హక్కు", "బాధ్యత", "కర్తవ్యం", "అప్పు", "ఋణము", "సంఖ్యలేదా "నియమిత కాలముఅనునవి ఒక వాక్యములోని క్రియా పదము యొక్క కర్మలుగా వచ్చినప్పుడు ''తవఫ్ఫ'' యొక్క అర్థము "నెరవేర్చుట", "పూర్తిగా నెరవేర్చుట", "సఫలపరచుట", "సమాప్తిచేయుట" అని గ్రహింపవలయును. కొన్ని ఉదాహరణలు:-

"తవఫ్‌ఫైత్ అల్‌ముద్దాహ్‌" (క్రియాపదం యొక్క కర్మ "నియమితకాలము"), అనగా, "సమయమును ముగించితిని" అని అర్థము; లేక

"తవఫ్ఫ హక్కహు" (క్రియాపదం యొక్క కర్మ ''హక్కు''), దీని అర్థము "తన హక్కును తాను పూర్తిగా తెలుసుకొన్నాడు" లేక 

"తవఫ్ఫ 'అదద్‌అల్‌-కౌం" (క్రియాపదం యొక్క కర్మ ''సంఖ్య''), దీని అర్థము "ప్రజల సంఖ్యను అతడు పూర్తిగా లెక్కించెను".

ఒక వాక్యములోని కర్త దేవుడైనప్పుడు [లేక మరణమోమరణకారణమైనది మరొకటేదైనా కర్తగా ఉన్నప్పుడుమరియు ఆ వాక్యములోని కర్మ (మానవుని వలె) ఒక జీవముగల ప్రాణియైనప్పుడు ఆ పదమునకు "మరణింపజేయుట", "ప్రాణము తీయుట" మొదలగునవి అర్థములుగా వచ్చునని గ్రహింపవలయును. కొన్ని ఉదాహరణలు:

"తవఫ్ఫ అల్లాహు జయెదన్‌" (కర్త ''అల్లాహ్'' మరియు కర్మ ఒక మానవుడు)  యొక్క అర్థం - "జయెద్‌ను దేవుడు చంపాడు".

"తవఫ్ఫ అల్‌ తాఊన్" (కర్త మరణకారణమైన ''తెగులు'' మరియు కర్మ ఒక మానవుడు) యొక్క అర్థం - "తెగులు వానిని చంపింది".

"తవఫ్ఫత్‍హు అల్‌మౌత్" (కర్త "మరణము" మరియు కర్మ ఒక వ్యక్తి) యొక్క అర్థం - "మరణము వానిని అధిగమించింది". 

"తవఫ్ఫత్‍హు అల్‌మలాయికహ్‌" (కర్త "దూతలు" - అనగా మరణకారకులు - మరియు కర్మ ఒక వ్యక్తి) యొక్క అర్థం - "దూతలు వానిని చంపిరి".

ఒక వాక్యములోని క్రియ నిష్క్రియాత్మక (passive form) రూపంలో ఉన్నప్పుడు, ఆ వాక్యములోని నిష్క్రియాత్మక అసమాపక క్రియ (passive participle) కూడా (మనిషివలె) జీవించు ప్రాణియైనప్పుడు ''తవఫ్ఫ'' అను ఆ పదమునకు "చనిపోవుట" అని అర్థము వచ్చునని గ్రహింపవలయును. ఉదాహరణకు:-

"తువుఫ్ఫియ జయెదున్‌" అనగా - "జయెద్‌చనిపోయెను" అని అర్థం. 

పై వివరణలనుండి చాలా సుస్పష్టముగా మనకు తెలుస్తున్నదేమనగా - "ముతవఫ్ఫీక" అను పదమునకు డా|| జమాల్‌బదవీ మరియు అదే అభిప్రాయము కలిగిన ఇతర ముస్లిం పండితులు ఇచ్చిన వివరణ లేక అర్థం సరియైనది కాదు. 

దిగువనివ్వబడిన వ్యాఖ్యానములు ముస్లిం కాషిఫ్ అహ్మద్‌షెహ్జాదహ్ వ్రాసిన ప్రకరణము/కృతి నుండి తీయబడినవి:

"అరబీ భాషలోని "ముతె వ ఫీక" అనే పదం "వఫ్‌ఫ" అనే మూలరూప పదం నుండి వచ్చింది. 'ఒకదానిని లేక ఒక పనిని శేషము లేకుండా సంపూర్తి చేయుట' అనే అర్థాన్ని ఇస్తుంది. ఇదే రీతిగా <వఫాత్అనగా 'మరణము' - ఎందుకనగా ఒక వ్యక్తి  యొక్క జీవితకాలము కూడా పూర్ణముగా మరణమందు ముగియును. <వఫ్‌ఫత్‌> అనే పదమునకు కొన్ని ప్రామాణికమైన అరబీ నిఘంటువులు ఇచ్చిన కొన్ని వివరణలు దిగువన ఇవ్వబడినవి:- 

'వఫ్‌ఫత్‌' = "మరణము", "చావు" (An advanced Learners Arabic - English Dictionary by H.Anthony Salmone, pp1222)

 'వఫ్‌ఫత్‌' =  "మరణము", "గతించుట", "చావు" (Al Mawrid Arabic-English Dictionary, pp1240)

'తువఫ' = "ఎవరి ప్రాణమునైన తీసికొనుట" (A Dictionary & Glossary of the Koran by J.Penrice pp 161)

'తూఫ్ఫ' = "మరణించుట", "చనిపోవుట", "గతించిపోవుట", "ప్రాణము విడచుట", "తుది శ్వాస విడచుట", "జీవితం చాలించుట" (Al Mawrid Arabic-English Dictionary pp 391)

ఆంగ్లం నుండి అరబీ భాషలోకి అనువదించే నిఘంటువులలో కూడా 'వప్‌ఫత్' అనుపదము యొక్క అర్థము మారకపోవుట చూడగా ఈ సత్యము మరొకసారి రూఢియగుచున్నది;

"DEATH" = "మరణము" = 'వఫ్‌ఫత్‌(Al Manar English-Arabic Dictionary pp157)

"DEATH" = "మరణము" = 'వఫ్‌ఫత్‌(Al Asri English-Arabic Dictionary pp 193)

"DEMISE" = "గతించుట" = 'వఫ్‌ఫత్‌(Al Asri English-Arabic Dictionary pp 199)

"DEMISE" = "గతించుట" = 'వఫ్‌ఫత్‌(Al Mawrid English-Arabic Dictionary pp259)

"DEATH" = "మరణము" = 'వఫ్‌ఫత్‌(Al Mawrid English-Arabic Dictionary pp251)

ఇలా సత్యాన్ని ఘోషిస్తున్న అరబీ భాష డిక్షనరీలు ఇంకా అనేక ఉన్నాయి.

అంతేకాకుండా, మనకు దొరికే అరబీ భాష నిఘంటువులన్నింటినీ ప్రక్కనపెడితే, ఈ పదము ఖురానులో కూడా అదే భావమును తెల్పుచూ ''మరణము'', ''గతించుట'' లేక ''ఒకని జీవిత కాలము ముగియుట''  అనే అర్థములతోనే ప్రయోగించబడినది అని చూస్తాముఈ దిగువనివ్వబడిన వచనములు ఖురాన్‍లోని "వఫ్‌ఫ", "ముతవఫ" అను పదముల అర్థమును మనకు చాలా స్పష్టముగా నిర్ధారించుచున్నవి. మీకు మీరుగా నిర్ధారించుకోవడానికి వీటన్నిటిని మరియు పైన అరబీలో ఇవ్వబడినవాటిని దయచేసి పరిశీలనగా చదవండి. అవి తెలుగులోనికి మౌల్వీ ముహమ్మద్‌అనువాదం చేసిన ఖురాన్‌మజీద్‌నుండి ఇవ్వబడినవి.

ఖురాన్‌లో అనేక వచనాలలో  'తవఫ్‌ఫ' అనే పదము 'మరణము'ను ఉద్దేశించుటకై వాడబడింది:-

"ఓ మా ప్రభువా! విశ్వాసము వైపునకు పిలుచుచు మీ ప్రభువును విశ్వసింపుడు అని పిలుచువాని పిలుపును మేము విని విశ్వసించితిమి. ఓ ప్రభువా! మా పాపములను క్షమింపుము. మా చెడుగులను మా నుండి తొలగింపుము. పుణ్యవంతులతోఁబాటు మాకు మరణము <తువఫ్‌ఫనా> దయచేయుము." (సూరా 3:193)

"మా ప్రభువు సూచనలు మా యొద్దకు వచ్చినప్పుడు వానిని నమ్మితిమి అనియే గదా నీవు మమ్ము విరోధించుచున్నావు! ఓ మా ప్రభువా! మాకు సహన మొసంగుము. ముసల్మానులుగ మృతినొందునట్లు <తువఫ్‌ఫనా> అనుగ్రహింపుము." (సూరా 7:126)

"ఓ నా ప్రభువా! నీవు నాకు కొంత రాజ్యము నొసంగితివి. విషయముల వాస్తవమును నాకు నేర్పితివి. ఆకాశములకును భూమికిని సృష్టికర్తవు నీవే. ఇహమునందును పరమునందును నాకు రక్షకుఁడవు. నీవు నన్ను భక్తునిఁగనే మరణింపఁజేయుము <తువఫ్‌ఫనీ ముస్లిమన్‌>. పుణ్యాత్ములతోఁజేర్పుము అని పలికెను." (సూరా 12:101)

"కావున దేవదూతలు వీరి ముఖములను వీరి వీఁపులను కొట్టుచు వీరి ప్రాణములను తీయునపుడు <తవఫత్‌‌హుమ్‌> వీరి గతి యేమి అగును!" (సూరా 47:27)

"మీలో నెవరైన మృతినొంది <యుతవఫ్‌ఫౌన> తమ భార్యలను వదలిపోయినచో అట్టి విధవలు నాలుగునెలల పదిరోజులు వేచియుండవలెను." (సూరా 2:234)

"మీ స్త్రీలలో నెవరైన వ్యభిచారము చేసినచో, దానికి మీలోని నలుగురు సాక్షులను తీసికొనిరండు, ఆ పిదప వారు సాక్ష్యమిచ్చినచో అట్టి స్త్రీలకు చావు వచ్చునంతవఱకును <యతవఫ్‌ఫ్ఫ హున్నె> లేక దేవుఁడు వారికొఱకు ఏదైన మార్గము నియమించునంత వఱకును ఇండ్లలో వారిని కనిపెట్టుఁడు." (సూరా 4:15)

"దేవుడు మిమ్మును పుట్టించెను. పిదప మీకు చావు నిచ్చును <యతవఫ్ఫకుమ్‌>. మఱి మీలో కొందఱు నిరర్థకమగు వయస్సును పొందుచున్నారు. అందునుఱింగిన పిదప నేమియు నెఱుంగకుందురు." (సూరా 16:70)

"ఓ జనులారా! మరలా సజీవులగుట గూర్చి మీకు సందేహమున్నచో (యోచింపుడు). మేము మిమ్ము మట్టితో జేసితిమి. ఆ పిదప వీర్య బిందువుతోను, ఆ తరువాత చిక్కని నెత్తురుతోను అటుపిమ్మట రూపము దాల్చినట్టియు లేనట్టియు మాంసపు కండతోను జేసితిమి. మీకు వివరముగ తెలుపుటకు (అట్లు చేసితిమి). మేము కోరిన దానిని నియమిత కాలము వఱకు గర్భములలో ఉంచుచున్నాము. ఆ తరువాత మిమ్ము శిశువులఁగఁజేసి పుట్టించుచున్నారము. పిదప మీరు మంచి యౌవనము పొందుటకు మిమ్ము వదలుచున్నారము. మీలో కొందఱు చనిపోవువారును <యుతవఫ్‌ఫ> గలరు. మఱి కొందఱు గ్రహించిన పిదప ఎద్దియు గ్రహింపకుండుటకై చాల అధమమైన వయస్సు నొందువారును గలరు..." (సూరా 22:5)

"మీపై నియమింపబడిన మృత్యుదేవత మీ ప్రాణము తీయును <యతవఫ్‌ఫాకుమ్‌>. మరల మీ ప్రభువు నొద్దకు మీరు రప్పింపబడుదురు అని ఓ ప్రవక్త! పలుకుము." (సూరా 32:11)

పైన ఇవ్వబడిన వచనములు ''యుతవఫ'' అనే పదమునకు ఉన్న అర్థమును చాలా స్పష్టముగా తెలియజేయచున్నవి.

పైన విశదముగా చూపబడిన సాక్ష్యాధారాల వెలుగులో - యేసుక్రీస్తు చనిపోలేదు కాని మరలా తిరిగి వచ్చి చనిపోవుట కొరకై పరలోకమునకు ఎత్తబడ్డాడు అనేది కేవలం ముస్లింల కట్టుకథ అని స్పష్టముగా గ్రహించగలుగుచున్నాము. మరి మీరు సత్యాన్ని ఎంచుకొని మీ కొరకై ప్రాణం పెట్టిన రక్షకుడైన యేసుక్రీస్తును మీ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించడానికి సిద్ధమేనా? మీరు సత్యమును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‍నందు మాత్రమే కనుగొనగలరు. నేడే బైబిల్‍ను కొనుక్కొని లేక మీ క్రైస్తవ స్నేహితుని యొద్దనుండి అడిగి తీసికొని నిజదేవుడైన యెహోవా గురించి, ఆయన రక్షకునిగా ఈ లోకానికి పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి అందు చదివి, విశ్వసించి రక్షణ పొందగలరు. దేవుడే మీకు ఆ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.

ఆంగ్ల మూలం - Al-Tabari On the Birth, Life, Death and Ascension of the Lord Jesus Christ


శాం షమూన్

ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు