క్రైస్తవ్యము పాశ్చాత్య మతమా? లేక ప్ర్రాచ్య, ఉత్తర, మరియు దక్షిణ మతమా?

 

తీవ్రమైన ప్రతిస్పందనలు కలిగించే వ్యాఖ్యలు కొన్ని మొదట నేను చేయదలచుకున్నాను.

యూదులందరు ఐశ్వర్యవంతులు

నల్లజాతీయులందరు మంచి పరుగు పందెగాళ్ళు

ఫ్రెంచ్ దేశస్థులందరు క్రూరులు    

మెక్సికో దేశస్థులందరు సోమరులు

అరబ్బులందరు తీవ్రవాదులు

ఆయా నాగరికతలను నిర్వచించుటకు మనుష్యులు తమ అభిప్రాయములను తమకిష్టమైన కొద్ది మాటలలో క్లుప్తంగా చెప్పవచ్చు. అయితే అవి తప్పు కావచ్చు. యూదులలో ఐశ్వర్యవంతులు ఉన్నారని నాకు తెలుసు, క్రూరులైన ఫ్రెంచివాళ్ళూ ఉన్నారు, సోమరులైన మెక్సికో వాళ్ళూ ఉన్నారు, నల్ల జాతీయుల్లో గొప్ప పరుగు పందెగాళ్ళూ ఉన్నారు, అరబ్బుల్లో తీవ్రవాదులూ ఉన్నారు. ఆయా జాతుల్లో చాలా కొద్దిమందే అలాంటి వారున్నారు. కాబట్టి, వారిని బట్టి ఆయా జాతులన్నియు పూర్తిగా అలాంటివే అని చెప్పలేము. అయితే, ఆయా నాగరికతలు మరియు ప్రాంతాల గురించి సరైన అవగాహన లేకపోవడం వలననో లేక వాళ్ళకు తెలియని దానిని గురించిన అజ్ఞానము చేతనో, సామాన్య మనుష్యులు ఈ విధముగా మాటలాడుటకు తెగిస్తారు. ఈ విధంగా చెప్పడం వలన మనుష్యుల మధ్య అపోహలు మరియు జగడములు ఎక్కువగును. ఉదాహరణకు ఇలాంటిదే మరొక ఉదాహరణ చూద్దాం.

"అమెరికా దేశీయులందరు క్రైస్తవులు"

ఒక అమెరికా దేశస్థుడిగా, మరియు క్రైస్తవుడిగా నేను ఒక విషయం చెబుతాను. నేను చెప్పబోయే ఈ విషయం సత్యదూరమైనది కాదు, ఎందుకంటే అమెరికాలో అనేక మందికి ‘క్రైస్తవుడు’ అనే పదానికి అర్థం కూడా తెలియదు.

అమెరికా దేశీయులమైన మేము సాధారణంగా ఏమనుకుంటామంటే, ఐరోపా ఖండంలో కలిగిన మతసంబంధమైన హింస నుండి తప్పించుకొనుటకై మా పితరులు ఈ దేశానికి వలస వచ్చారని నమ్ముతాము. (అనగా ముస్లింలను క్రూసేడ్ యుద్ధ సమయంలో చంపిన క్రైస్తవ మనస్తత్వమే ఆ తరువాత తమకు ఇష్టము కాని బోధ చేసిన సహ క్రైస్తవులను కూడా హింసించుటకు మొదలు పెట్టిందని మేము నమ్ముతాము). అంతేకాకుండ, బైబిల్లో ఉన్న నియమాలు, చట్టాలు, మరియు సత్యముల మీదనే మా స్వేచ్ఛలు, శాసనాలు, చట్టాలు ఆధారపడి ఉన్నాయని మేము నమ్ముతాము. వాటిలోని ఒక స్వేచ్ఛ - దేవుని ఆరాధించుట కొరకైనది, మరొక స్వేచ్ఛ - ప్రభుత్వము పెట్టే అన్యాయపు హింసను వ్యతిరేకించుటకైనది. కాబట్టి ఈ ఆలోచనతో అమెరికా దేశ ప్రభుత్వము తమ విధానాలను ఏవిధంగా రూపొందించిదంటే, తమ పౌరులు దేశంలోని ఎవరి చేతిలోనూ బాధపడకుండా, ఇరుకున పడకుండా వుండునట్లుగాను; అదేసమయంలో చట్టము తన పని సజావుగా చేయుట ద్వారా అవినీతి, ఆరాచకము ప్రబలకుండా ఉండునట్లుగాను రూపొందించినది.

ఈ విధంగా కలిగిన స్వేచ్ఛ వలన చారిత్రక-ప్రాముఖ్యత కలిగిన మేళవింపు ఒకటి ఇక్కడ జరిగింది. పలు ప్రాంతముల నుండి వలస వచ్చిన ప్రజల కలయిక ఇక్కడ జరిగింది. నానా రకముల పూర్వజీవితం కలిగిన మనుష్యులు ఇక్కడ సహజీవనం చేయటం ప్రారంభించారు. ఇతరులు నీవంటి విశ్వాసం కాక, వేరొక విశ్వాసం కలిగివుండుట చేత వారిని హింసిస్తే ఇక్కడి చట్టం ఒప్పుకొనదు. ప్రజలందరూ ఈ సమజీవనాన్ని ఆచరించడానికి ఇష్టపడకపోయినా కాని, గలతీ పత్రిక 3:28లో ఉన్నట్లుగా - "ఇందులో యూదుడని హెల్లేనీయుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు;" అన్న దేవుని ఆలోచనను ఆధారం చేసుకొని ఈ భావన పుట్టింది.

అయినా కాని, అమెరికా దేశము పుట్టినది మొదల్కొని సంవత్సరములు గడుస్తున్నకొలది మా స్వేచ్ఛకు కారణమైన ఈ పునాదులు కదిలిపోయి వాటిని క్రమక్రమంగా మరచిపోవటం జరుగుచున్నది. ‘మా దేశము క్రైస్తవ సూత్రాల పునాది మీద కట్టబడింది’ అని మనుష్యులు అస్పష్టంగా గుర్తుపెట్టుకున్నారే తప్ప, దాని అర్థం ఏమిటో మాత్రం ఇంకా వారికి తెలియదు. అందువలన, వారు ‘క్రైస్తవుడు’ అనే పదమును కేవలం నాగరికతకు మాత్రమే పరిమితమైన పదముగా (సాంస్కృతిక విశేషణగా) పరిగణిస్తున్నారు. ఒకవేళ ఒకని తల్లిదండ్రులు క్రైస్తవులయితే వారి సంతానం కూడా క్రైస్తవులుగా పరిగణించబడుతున్నారు. దేవుని వాక్య ప్రకారం ఇది సరైనదేనా? కాదు.

ఈ దేశపు పునాదులు వేసిన పితామహులు, ఈ దేశమును ఒకవేళ క్రైస్తవ దేశంగా ప్రకటించి ఉండుంటే ఈనాడు ఉన్న ఈ సమస్య, ఆలోచనలలోని ఈ గలిబిలి అసలు ఏర్పడి ఉండేవి కావు; కాని వారు అలా చేయలేదు.  క్రైస్తవ్యంలోని ఒక ముఖ్యమైన నియమము ఏమంటే - ఎవరు కూడా మరొకరిని విశ్వసించమని బలవంతం చేయకూడదు; నీవు నీ స్వచిత్తానుసారముగా ఆయన ప్రేమను మరియు ఆయన కృపను అర్థం చేసుకుని తన వద్దకు రావాలనేదే దేవుని  కోరిక కూడా. అందువలననే ఈ దేశానికి పునాదులు వేసిన పితామహులు, ‘విశ్వాసము’ అనే ప్రశ్నను ఎవరి మీదా బలవంతంగా చొప్పించకుండ, వారి తరువాతి భవిష్యతరాలలోని ప్రతి వాడూ దానికి తనదైన జవాబు చెప్పుకోవాలని దానిని వారికే విడిచిపెట్టారు.

ఈ విధంగా, ‘స్వేచ్ఛ’ అంటే - ‘ప్రతివాడు తనకున్న విశ్వాసం మరియు క్రియలకు స్వయంగా బాధ్యుడు’ అనే నిర్వచనం వస్తోంది. దురదృష్టవశాత్తు మనుష్యులు క్రీస్తు బోధను నమ్మడానికి బదులు, ఏ బోధను కూడా నమ్మకపోవడమే హాయి అని తమ ‘స్వేచ్ఛ’ను దుర్వినియోగపర్చుకుంటున్నారు. ఇంకా దారుణమేమనగా తమకి కష్టం కలిగించేవి కాకుండా, కేవలం సుఖాన్ని ఇచ్చేవి లేక బాధను తొలగించే బోధలను మాత్రమే సుముఖతతో పాటిస్తున్నారు. దీని వలన ‘క్రైస్తవ్యము’ అనే పదము చాలా పలుచన అయిపోయింది. అందుచేత ఇప్పుడు అమెరికా దేశంలో ‘క్రైస్తవుడు’ అంటే క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినవాడనో లేక తనకు ఏదైతే సరైనదనిపిస్తుందో దానిని చేయుటకు ప్రయత్నించువాడని మాత్రమే అర్థము మిగిలినది. అంటే, మనుష్యల పట్ల న్యాయంగా ప్రవర్తించి, వారిని శపించకుండా, మద్యపానము సేవించకుండా ఉండినట్లైతే నీవు క్రైస్తవ పద్దతిలో ఉన్నావని అనటం పరిపాటిగా మారిపోయింది. అక్కడ యేసుప్రభువు యొక్క ప్రస్తావన ఎంతమాత్రమూ కనిపించదు. క్రైస్తవునికి ఉన్న నిర్వచనము ఈవిధంగా మారిపోవుట వలన అమెరికాలోని అత్యధిక మనుష్యులు క్రైస్తవ్యానికి చాలా దూరంగా కనిపిస్తున్నారు.

యేసుప్రభుని మాటలని నమ్మిన మేము ఇప్పుడు ఒక ఆసక్తికర పరిస్థితిలో ఇరుక్కున్నామని మీరు ఊహించవచ్చు. మా విశ్వాసం గురించి మా పొరుగువారితో మాట్లాడాలని ప్రయత్నించేటప్పుడు మేము మాట్లాడబోయే ప్రతి పదానికి ముందుగా అర్థం చెప్పుకొని, నిర్వచించుకొని మాట్లాడవలసిన ప్రమాదం ఏర్పడింది. ఉదాహరణకి ‘చర్చ్’ అనే పదానికి కూడ ‘దేవుని యొక్క శరీరము’ అనే అర్థము లేకుండా పోయి, మతాసక్తి గలవారు కూడుకునే ఒక కట్టడమని అర్థము ఈనాడు వచ్చింది. ఇలాంటి గందరగోళము మన మధ్యనే నెలకొని ఉండగా ఇతర మతాలకు చెందిన వ్యక్తులు (ముస్లిములు) మనతో మాట్లాడినప్పుడు వారు ఇంకెంత గందరగోళానికి గురవుతారో అర్థం చేసుకోవడం అంత కష్టమేమి కాదు.

క్రైస్తవ్యమును గూర్చి ఇలాంటి అపార్థము కలుగుటచేత ఎంతటి ప్రమాదకరమైన, భయావహమైన పరిస్థితులు ఎదురగుచున్నవో నేను టర్కీ దేశమునకు వెళ్ళినప్పుడు గ్రహించాను. నేను ఆ దేశంలో ఒక స్నేహితురాలితో ప్రయాణిస్తుండినప్పుడు, మేము కలువబోతున్న వారికి చూపించడానికై మాతో పాటు మా కుటుంబికుల ఫోటోలు కొన్ని తీసుకు రమ్మని మాకు చెప్పబడింది. నా స్నేహితురాలికి నలుగురు కుమారులున్నారు. ఆమె తన పిల్లల ఫోటోలు తీసుకువచ్చింది. తాను ఇంటిలో విడిచిపెట్టి వచ్చిన తన చిన్న పిల్లల గూర్చి మాటి మాటికి గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు మాకు టర్కీ దేశాన్ని చూపుతూ మాతో ఆంగ్లములో సంభాషిస్తుండిన మా అనువాదకుడు, నా స్నేహితురాలి నలుగురు పిల్లలకు విడివిడిగా ఎంతమంది తండ్రులో అక్కడ మాతోపాటున్న టర్కీ దేశస్థులు తెలుసుకొనగోరుచున్నారని మాతో అన్నప్పుడు మేము నిర్ఘాంతపోయాము. విచారకరమైన విషయం ఏమనగా, అమెరికాలోని "సోప్ ఒపేరా"లు అనేక దేశాలోని ప్రజలు చూస్తుండటం వలన, అందులో వారికి కనపడే విచ్ఛలవిడి జీవనశైలే మా దేశంలోని జీవన విధానమని నమ్ముతున్నారు. నా స్నేహితురాలు వెంటనే జోక్యం చేసుకొని తన పిల్లలకు ఒక్కడే తండ్రి అని వారికి వివరించింది. కాని ఈ సంబాషణ మా మనసులో చెరగని ముద్ర వేసింది. ఒకవేళ సోప్ ఒపేరాలు=అమెరికా దేశస్థులు అయితే, మరియు క్రైస్తవులు=అమెరికా దేశస్థులు అయితే, అప్పుడు సోప్ ఒపేరాలు=క్రైస్తవులు అవుతుంది కదా! అలాంటప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి తీసుకువచ్చిన మంచి వార్త, అనగా సువార్త యొక్క ఆ నిర్మల సందేశం ఏమైనట్టు?

ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువువారు ఎవరు? ఆయన తెల్లని శరీరం కలిగి, నీలపు కళ్లు కలిగిన పాశ్చాత్య దేశీయుడా? ఆయన యూదుడుగా పుట్టారని నా బైబిల్ నాకు చెప్పుచున్నది. కాబట్టి ఆయనకు తెల్లని చర్మము మరియు నీలి కన్నులు ఉండే అవకాశమే లేదు. ఆయన మధ్యప్రాచ్య ప్రాంతమునకు చెందిన వారు కాబట్టి, నిస్సందేహంగా ఆ ప్రదేశపు వారిలాగానే ఉండుంటారు. ఆయన యూదుల ఇంటిలో పెరిగారు, ఇశ్రాయేలు దేశంలోనే తన జీవితమంతా గడిపారు. అలాంటప్పుడు, ఒక మధ్యప్రాచ్య యూదుడిని కేంద్రంగా కలిగియున్న ఒక మతము పాశ్చాత్య మతంగా ఎలా పిలవబడుతుంది? ఆలోచించండి!

యేసుక్రీస్తు ప్రభువారిచ్చిన శుభసందేశంలో ఉన్న ఒక మహిమకర విషయమేదనగా, దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలెననునదియే. ఆయన తెచ్చిన రక్షణ సందేశం - ప్రాంతము, నాగరికత, పెంపకం అనేవాటికి అతీతమైనది. దేవుడు తన రక్షణ ప్రణాళిక ఏ విధంగా రచించాడంటే, అది ప్రతి తీరాన్ని దాటుతూ ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి కూడ అందుబాటులో ఉండేటట్లుగా రచించాడు. ప్రపంచమంతా కూడ ఆయనకు ఆరాధన స్థలమే. ప్రతి భాష కూడ దేవుని గొఱ్ఱెపిల్లను స్తుతించడానికి, కీర్తించడానికి యోగ్యమైనదే. మనమందరం కూడ వివిధ రకాలైన నాగరికతలలో నివసిస్తున్నామని ఆయనకు తెలుసు. వాటన్నింటిని కూడ మనం ఆయన యొక్క కృపా సింహాసనాన్ని చేరుకోవడానికి వాడుకొవచ్చు. ఈ విధముగా, మానవులు తనను చేరుకొనగలిగే సర్వోత్తమమైన, సామాన్య మార్గ ప్రణాళిక గురించి కేవలం దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆలోచించగలిగారు.

ప్రస్తుతం ప్రపంచంలోని మిగితా భాగాల్లో కూడ పాశ్చాత్య దేశాల ప్రజలు అత్యధిక సంఖ్యలో కనిపిస్తారు. నిజానికి గతంలో అలా ఉండలేదు, బహుశా భవిష్యత్తులో కూడ అలా ఉండబోదేమో! మనమందరం కూడ మన వర్తమానకాల వ్యవహారములలో మునిగిపోయాము గనుక, మన అనుదిన జీవితములో గతచరిత్రను గమనించడం కష్టంగా ఉన్నది. క్రైస్తవ్యం మధ్యప్రాచ్య ప్రాంతము నుండి పాశ్చాత్య తీరానికి చేరడానికి కారణం ఏమిటి? ప్రపంచములోని మిగతా ప్రాంతములకు అది చేరిన విధంగానే పాశ్చాత్య తీరానికీ చేరాలని దేవుడు ఆదేశించాడు కనుక! ఈ రోజు అనేకమంది ఆఫ్రికా దేశస్థులు కూడ యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరిస్తున్నారు. ఆసియా ఖండంలో క్రీస్తు యొక్క సంఘము వర్థిల్లుచున్నది. కొరియా దేశం తన మిషనరీలను అమెరికా దేశానికి కూడా పంపుచున్నది! (అమెరికా దేశస్థులందరూ క్రైస్తవులు కారన్న సత్యాని ఈ విషయం మనకు బయలు పరుస్తున్నది). బహుశా, కొన్ని వందల సంవత్సరముల తరువాత యేసుక్రీస్తు ప్రభువును ఒక నల్లజాతీయుడిగానో, బాదంగింజ వంటి కన్నులు కలవారిగానో అభివర్ణిస్తారేమో! అయినా కాని సువార్త మీద అది ఏ మాత్రం ప్రభావం చూపదు; ఎందుకంటే ఆయన సువార్త సందేశం మాత్రం ఎన్నటికీ మారదు. అదేదనగా,

''దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను''. (యోహాను 3:16)

ఆంగ్ల మూలం - Why Christianity is Western?


మౌలిక క్రైస్తవ్యం
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు